కొత్తిమీర / Coriander Leaves
From LTRC
| Scientific Classification | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophyta |
| Class | Magnoliopsida |
| Order | Apiales |
| Family | Apiaceae |
| Genus | Coriandrum |
| Scientific Name | Coriandrum sativum L. |
భారతదేశమందంతటా పండించే మొక్క కొత్తిమీర. దీని గింజలనే ధనియాలు అంటారు. కొత్తిమీర చిన్నగా ఉన్న సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది. ఇందులో కొరియాండాల్, లైనాకాల్, జెరినియాల్, d-Pinine, l-Pinene మొదలగునవి కూడా కలవు. ఇది త్రిదోషహరము, గ్రాహి, దీపన, పాచన కర్మలను కలిగి ఉంది.
ఇది కషాయ తిక్త మధురకటు రసములు, లఘుస్నిగ్ధ గుణములు, ఉష్ణవీర్యము మరియు మధురవిపాకము అను గుణములను కలిగి ఉంది. దీనిని తృష్ణ, మంట, జ్వరము, వాంతి, క్రిములు, అర్షమొలలు, దగ్గు, దమ్ము మొదలగు వ్యాధులందు ఉపయోగిస్తారు.
వివిధ భాషల్లో పేర్లు
- తెలుగు: కొత్తిమీర
- సంస్కృతం: ధాన్యకా
- హిందీ: ధనియాపత్తా
- లాటిన్: కొరియాండమ్ సెటైవమ్ (Coriandrum sativum)
- కుటుంబము: Apiaceae
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల కొత్తిమీరలో ఉండే పోషక విలువల వివరాలు:
- కార్బోహైడ్రేట్లు: 5 గ్రాములు
- ప్రోటీన్లు: 3 గ్రాములు
- క్రొవ్వు: 0.7 గ్రాములు
- కాల్షియం: 140 మి.గ్రా
- పాస్ఫరస్: 60 మి.గ్రా
- ఐరన్: 8 మి.గ్రా
- విటమిన్ - ఎ: 13,580 I.U
- విటమిన్ - బి1: 49 మైక్రో గ్రాములు
- విటమిన్ - బి2: 60 మైక్రో గ్రాములు
- నియాసిన్: 0.7 మి.గ్రా
- విటమిన్ - సి: 131 మి.గ్రా
- సోడియం: 4 మి.గ్రా
- పొటాషియం: 453 మి.గ్రా
- ఆక్సాలిక్ యాసిడ్: 5 మి.గ్రా
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- వాతరక్తము: ధనియాలు, జీలకర్రలను మెత్తగా నూరి బెల్లము కలిపి సేవించిన వాతరక్త మందలి దోషములు తొలుగును.
- స్మాల్ పాక్స్: కొత్తిమీర నుండి రసము తీసి అందులో అరటిపండు గింజలు కలిపి 7 రోజులు వరుసగా ఇచ్చిన స్మాల్ పాక్స్‌ను నిరోధించవచ్చు.
- ఎలర్జీ మరియు శ్వాసరోగాలు: కొత్తిమీర ఆకుల రసము మరియు తేనె కలిపి క్రమంగా వాడిన యెడల ఎలర్జీ, ఆస్త్మా లాంటి జబ్బులు రాకుండా నిరోధించబడతాయి.
- విటమిన్ల లోపం: విటమిన్లు అయిన ఎ, బి, బి2, సి మొదలగు వానితోపాటు ఐరన్ లోపించిన రోగులకు, దీనిని ఇవ్వటం ఎంతో ఉపయోగకరము.
- కడుపుబ్బరం - అజీర్ణము: కొత్తిమీర ఆకుల రసమును త్రాగిన కడుపుబ్బరం, అజీర్తి తగ్గుతుంది.
- నోటిలోపుండ్లు: కొత్తిమీర ఆకులను క్రమక్రమంగా నములుతున్నయెడల నోటీలో పుండ్లు తగ్గుతాయి. నోటిదుర్వాసన నిరోధించబడుతుంది.
- దాహము: జ్వరము నందు అంతర్దాహము (మంట) కలిగినప్పుడు ధనియాల కషాయము ఇచ్చిన ఉపయుక్తంగా ఉండును.
- ముక్కులో నుండి రక్తం కారుట: కొత్తిమీర రసమును ముక్కులో Drops లాగా వేసిన యెడల ముక్కునుండి రక్తం కారటం తగ్గుతుంది. ముక్కునుండి వచ్చు చెడువాసన కూడా నివారించబడుతుంది.
- మొటిమలు మరియు ముఖ సౌందర్యానికి: కొత్తిమీర ఆకుల రసమునందు పసుపు కలిపి ముఖమునకు ప్రతిరోజు రాత్రి రాసి ఉదయం కడిగివేసిన మొటిమలు నివారించబడతాయి. ఇవి 20-25 రోజులు చేయాలి. దీని వలన ముఖ వర్చస్సుకూడా పెరుగుతుంది. ముఖం ఎండిపోయినట్లు ఉండటం తగ్గుతుంది.
- పంటినొప్పులు - చిగుళ్ళవాపులు: కొత్తిమీర ఆకులతో కషాయం కాచి దానిని పుక్కిట పట్టించి ఊచిన పంటినొప్పులు, చిగుళ్ళవాపులు తగ్గిపోతాయి.
- ఆకలి పుట్టుటకు: కొత్తిమీర పచ్చడి చేసుకుని తినిన ఆకలి పుడుతుంది. ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది.
- శ్వాస - కాస: చిన్నపిల్లలకు వచ్చు దగ్గు- ఆయాసము నందు ధనియాల ముద్దను మెత్తగా నూరి ముద్దగా చేసి బియ్యము కడుగు నీటితో పాటు పంచదార కలిపి ఇచ్చిన ఉపయుక్తంగా ఉండును.
- పుల్లటి తేన్పులు - పైత్యము: కొత్తిమీరను తినటం వలన వాంతులు, వికారాలు నిరోధించబడతాయి. పుల్లటి తేన్పులు, పైత్యము తగ్గుతుంది.
- కండ్ల కలక - కళ్ళ మంటలు: కొత్తిమీర రసము మరియు చనుబాలు కలిపి కళ్ళలో వేసిన కళ్ళమంటలు మరియు కళ్ళకలకలు తగ్గుతాయి.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 386, 387, 388)
- రచయిత: డా|| టి. భిక్షపతి
