ఇంగువ / Asafoetida

From LTRC
ఇంగువ / Asafoetida
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Apiales
Family Apiaceae
Genus Ferula
Scientific Name Ferula foetida (Bunge) Regel

ఇంగువ మొక్క సుమారు 2 మీటర్ల వరకు పెరుగుతుంది. భారతదేశములో దీనిని సాగుచేస్తున్నారు. ఇంగువను సాంబారులో వేస్తే దానికి చక్కని రుచి అబ్బుతుంది. ఇది కఫవాత శామకము, పిత్తవర్ధకము, హృద్యము, బల్యము, భేదనీయము, ఆర్తవజననము మరియు అనులోమనముగా పనిచేస్తుంది. ఇది కటురసము, లఘుస్నిగ్ధ తీక్ష్ణ గుణము, ఉష్ణవీర్యము, కటు విపాకములను కలిగి ఉంది. దీనిని కడుపునొప్పి, కడుపుబ్బరం, క్రిములు, గుల్మము, శూల, ఉదరరోగాల, అపస్మారకము, మూర్చలతోపాటు అర్షరోగములందు ఉపయోగిస్తారు. హింగువ నాడీ మండలాన్ని ఉత్తేజపరుస్తుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: ఇంగువ
  • సంస్కృతం: హింగు
  • హిందీ: హీంగ్
  • లాటిన్: ఫెర్యులా పాయిటీడా రీగల్ (Ferula foetida)
  • కుటుంబము: Apiaceae

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • అతిసారం, జిగట విరేచనాలు: హింగును దోరగా వేయించి చక్కగా చూర్ణము చేసి ఉదయం - సాయంత్రం మజ్జిగతో కలిపి వాడిన అతిసారం, జిగట విరేచనాలలో ఉపశమనము కలుగుతుంది, కడుపునొప్పి తగ్గుతుంది.
  • కీళ్లజబ్బులు: కీళ్లజబ్బులతో, నరాల వ్యాధులతో బాధపడు వ్యక్తులకు ఇంగువ మంచిది. ఇంగువ మరియు తేనె కలిపి ఉదయం - సాయంత్రం సేవిస్తే మంచి ఉపశమనము కలుగుతుంది. మిరియాలు, శుంతి, గుగ్గిలము (గుగ్గులు) మరియు ఇంగువలను చూర్ణముచేసి సమభాగములుగా కలిపి తేనెమై నంలను కరిగించి ఒక గుడ్డలో కట్టి నొప్పి ఉన్నచోట పట్టువేస్తే తగ్గుతుంది.
  • పంటినొప్పి: పంటినొప్పితో మరియు పిప్పిపళ్లతో బాధపడు రోగులు ఇంగువను కొద్దిగా వేడిచేసి దానిని పంటినొప్పి ఉన్న భాగంలో పెట్టిన యెడల నొప్పి తగ్గుతుంది.
  • ఋతుక్రమము: సరిగా ఋతుక్రమము రాక బాధపడు స్త్రీలు ఇంగువను పొంగించి బెల్లం చేర్చి వాడిన ఋతుక్రమము మొదలవుతుంది.
  • అపానవాయువు - కడుపుబ్బరం: గాలి బయటికి రాక పొట్ట బిగపట్టిన రోగులకు హింగు మంచిది. ఈ రోగులు హింగును వేడి నీళ్లతో కలిపి సేవిస్తే అపానవాయువు బయటికి వెడలి కడుపుబ్బరం తగ్గి పొట్ట హాయిగా ఉంటుంది.
  • ప్రసవించిన స్త్రీలకు: ప్రసవించిన స్త్రీలకు ఇంగువ ఇచ్చిన గర్భాశయం కొద్దిరోజుల్లోనే సాధారణ స్థితికి వస్తుంది.
  • తలనొప్పి: ఇంగుపను కరిగించి 3-4 చుక్కలు ముక్కులో వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
  • పాలు వృద్ధి కావడానికి: 1 గ్రాము హింగు మరియు లవంగాలతో తయారుచేసిన ద్రావకము రోజుకు 3 సార్లు ఇచ్చిన పాలు వృద్ధి అవుతాయి.
  • ఇంపాటెన్సీ - స్పెర్మటోరియా మరియు శీఘ్రస్ఖలనము: పొంగించిన హింగు 125 మి.గ్రా, 1 చెంచా తేనె మరియు మర్రి పాలు (6-7 చుక్కలు) కలిపి సూర్యోదయానికి ముందు 40 రోజులు సేవించిన శీఘ్రస్ఖలనము, నపుంసకత్వము, స్పెర్మటోరియా మొదలగు వాటిలో ఎంతో ఉపయోగకరము. దీని వలన సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
  • ఆస్త్మా, దగ్గు మరియు బ్రాంకైటీస్: హింగు 60-125 మి.గ్రా, తేనె 2 చెంచాలు, తెల్ల ఉల్లిపాయలరసము 1/4 స్పూన్, తమలపాకులరసము 1 స్పూన్ కలిపి రోజుకు 3 సార్లు త్రాగిన ఆస్త్మా, బ్రాంకైటీస్ లందు ఉపయోగకరము.
  • హిస్టీరియా మరియు జలుబు: హింగును వాసన చూసిన యెడల హిస్టీరియా ఎటాక్స్ నివారించబడతాయి. జలుబు నివారించబడుతుంది.
  • హృదయ శూల: హింగువను కుంకుమతో కలిపి సేవించిన హృదయశూల తగ్గుతుంది.

జాగ్రత్తలు / హెచ్చరికలు

  • గర్భిణీ స్త్రీలు: గర్భిణీ స్త్రీలు ఇంగువను వాడకూడదు.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 364, 365)
  • రచయిత: డా|| టి. భిక్షపతి