కమలము / Lotus

From LTRC
కమలము / Lotus
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Proteales
Family Nelumbonaceae
Genus Nelumbo
Scientific Name Nelumbo nucifera Gaertn.

కమలం నీటిలో పెరిగే బహువార్షిక మొక్క. భారతదేశంలోని ఉష్ణ మండలపు చెరువులలో పెరుగుతుంది. కమలం చాలా అందమైనది, మనస్సును మనోహరంగా ఉంచుతుంది. కమలము యొక్క కాండమును, మూలమును ఆహారంగా తినటం విశేషము. ఇది జమ్ము, కాశ్మీర్ ప్రజల ఇష్టమైన వంటకము. ఇంకా దీని గింజలను, పుష్పములను కూడా ఆహారంగా స్వీకరిస్తారు.

కమలము మధుర కషాయతిక్త రసమును శీత వీర్యము, స్నిగ్ధ పిచ్ఛిల లఘుగుణమును మధుర విపాకములను కలిగి ఉంది. ఇది కఫపిత్తశామకము, వర్ణ్యము, మూత్ర విరజనీయము, గ్రాహి గర్భస్థాపక కర్మలను కలిగి ఉంది. దీనిని దప్పిక, (తృష్ణ) మంట (దాహము), బొబ్బలు (విస్ఫోటము) హెర్పేస్ జోస్టర్ విసర్ఫము లాంటి వ్యాధులందు ఎక్కువగా ఉపయోగిస్తారు. కమలము మన జాతీయపుష్పం.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: తామర పువ్వు
  • సంస్కృతం: పద్మ, కమలము
  • హిందీ: కమల్
  • లాటిన్: నిలంబో నుసిఫెరా గర్టనర్ (Nelumbo nucifera)
  • కుటుంబము: Nelumbonaceae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల కమలము యొక్క మూలం (Rhizome) నందు ఉండే పోషక విలువల వివరాలు:

  • తేమ: 83.80 %
  • ప్రోటీన్లు: 2.70 మి.గ్రాములు
  • సుక్రోజ్: 0.80 మి.గ్రా
  • క్రొవ్వు: 0.80 మి.గ్రా
  • బూడిద: 1.10 మి.గ్రా
  • కాల్షియం: 0.06 మి.గ్రా
  • థైమిన్: 0.22 మి.గ్రా
  • రైబోఫ్లేవిన్: 0.66 మి.గ్రా
  • నియాసిన్: 2.1 మి.గ్రా
  • ఆస్కార్బిక్ యాసిడ్: 15 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • దగ్గు (పిత్తజకాస): కమలము యొక్క గింజలను తేనెతో కలిపి సేవించిన పిత్తజకాస తగ్గుతుంది.
  • చర్మావ్యాధులు: కమలము యొక్క వేర్లను మెత్తగా నూరి దానిని తామర (రింగ్ వార్మ్) మరియు చర్మవ్యాధులందు రాసిన మంచి ఉపశమనము కలుగుతుంది. చల్లగా హాయిగా ఉంటుంది. కమలములను గ్రుచ్చి మాలలు మెడలో వేసుకుంటే చల్లగా హాయిగా మనస్సు తేలిపోయినట్లు ఉంటుంది, వేడి తగ్గుతుంది.
  • కళ్ళమంటలు: కమలములను మెత్తగా నలిపి (వాటినుండి వచ్చు రసమును కూడా) కళ్ళమీద పెడితే కళ్ళమంటలు తగ్గుతాయి.
  • బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు: కమలము యొక్క సెలైన్ ఎక్స్‌ట్రాక్ట్స్‌కు అనేక రకాల బ్యాక్టీరియాలను సంహరించే గుణముందని పరిశోధకులు గమనించారు.
  • అతిసారము, జిగురు విరేచనాలు, ఆకలి మందగించటం: కమలము యొక్క రేకులు అతిసారము, జిగురు విరేచనాలు మరియు ఆకలి మందగించటం లాంటి రుగ్మతల యందు ఉపయుక్తంగా ఉంటుంది.
  • స్మాల్‌పాక్స్: కమలములతో తయారుచేసిన షర్బత్ (శీతల పానీయం) లందు వట్టివేరు, చందనము కలిపి తయారుచేసి దీనిని స్మాల్‌పాక్స్, చికెన్‌పాక్స్ వచ్చిన రోగులకు ఇస్తే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. దీనిని వేసవి డ్రింక్‌గా కూడా వాడొచ్చు.
  • ఇతర ఉపయోగాలు: కమలములను పూజలో ఉపయోగిస్తారు. కమలములతో చేసిన అత్తరు చాలా ప్రసిద్ధి పొందింది, ధర కూడాక్కువే.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 403, 404, 405)
  • రచయిత: డా|| టి. భిక్షపతి