కందులు / Pigeon Pea
| Scientific Classification | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophyta |
| Class | Magnoliopsida |
| Order | Fabales |
| Family | Fabaceae (Papilionaceae) |
| Genus | Cajanus |
| Scientific Name | Cajanus cajan (L.) Millsp. |
మన నిత్య ఆహారంలో ఉపయోగించే వాటిలో కందులు / కందిపప్పు ఒకటి. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో దీనిని పండిస్తున్నారు. ఆహారంగా ఔషధంగా విలువైనది కందిపప్పు. మాంసాహారము అంటే ఇష్టము లేని వ్యక్తులు కందులతో చేయు పదార్థము తిన్నయెడల ఆ లోటును పూడ్చవచ్చు. కందులు తొందరగా జీర్ణమౌతాయి. కంది చెట్టు యొక్క లేత ఆకుల్ని కూరగా చేసుకొని తింటారు. కంది గింజలతో చేయు కంది కట్టు చాలా బలమైనది. కందిపప్పు బలమైనది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అయితే ఎక్కువగా తింటే అసిడిటీని కడుపుబ్బరాన్ని కూడా కలిగిస్తుంది. ఏదైనా అతి మంచిది కాదు కదా!
చర్మవ్యాధులు, రక్తదోషాలు, రక్తహీనత, కఫవ్యాధులు, వాత వ్యాధులతో బాధపడేవారు దీనిని తప్పకుండా తీసుకోవాలి. ఎదిగే పిల్లలకు ఇది చాలా మంచిది. ఆపరేషన్లు అయినవారికి కూడా ఇది మంచిది.
विभिन्न భాషల్లో పేర్లు
- తెలుగు: కందిపప్పు / కందులు
- సంస్కృతం: తువరి / కందులు
- హిందీ: హరాక్ కీ దాల్
- లాటిన్: కజానస్ కజాన్ (Cajanus cajan)
- కుటుంబము: Papilionaceae / Fabaceae
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల కందుల్లో ఉండే పోషక విలువల వివరాలు:
- కార్బోహైడ్రేట్లు: 75.2 గ్రాములు
- ప్రోటీన్లు: 22.3 గ్రాములు
- క్రొవ్వు: 1.7 గ్రాములు
- కాల్షియం: 140. మి.గ్రా
- పాస్ఫరస్: 425.2 మి.గ్రా
- ఐరన్: 8.8 మి.గ్రా
- విటమిన్ - ఎ: 220 I.U
- విటమిన్ - బి1: 450 మైక్రో గ్రాములు
- విటమిన్ - బి2: 506 మైక్రో గ్రాములు
- పొటాషియం: 435 మి.గ్రా
- సోడియం: 63 మి.గ్రా
ఇంకా అమెనోఆసిడ్స్ ఎన్నో ఉన్నాయి. అవి హిస్టిడిన్, ఆర్జినిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, సిస్టిన్, మితియోనిన్, ఫినైలాలనిన్, థ్రియోనిన్, ట్రిప్టోఫాన్ మరియు వాలిన్ అనునవి కందుల్లో ఉండటం విశేషం.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- రక్తస్రావము: కంది చెట్టు ఆకుల్ని నీళ్లలో మరిగించి ఆ నీళ్ళు సేవించిన రక్తస్రావము ఆగుతుంది.
- విరేచనాలు: కంది ఆకు రసము నందు శుంటి కలిపి అందులో పంచదార కూడా కలిపి దానిని సేవించిన యెడల విరేచనాలతో బాధపడు వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది.
- పాము విషమునకు: లేత కంది గింజలు మరియు లేత కంది ఆకులను కలిపి చిక్కని కషాయం కాచి దానిని పాము కరిచిన వ్యక్తులకు ఇచ్చిన ఉపశమనంగా ఉంటుందని బాటనిస్ట్లు చెబుతున్నారు.
- బలహీనులయిన పిల్లలకు: కందితో కంది కట్టు చేసి ఇచ్చిన బలహీనులకు ఎంతో ఉపయోగకరము.
- పాలు ఆగిపోవుట: కంది గింజలు మరియు ఆకులు కలిపి మెత్తగా నూరి స్తనమునకు పట్టు వేసిన పాలు ఆగిపోతాయి.
- అర్షమొలలు: కంది ఆకులు మరియు వేప ఆకులను మెత్తగా నూరి 3.4 గ్రాముల చొప్పున 7 రోజులు సేవించిన అర్షమొలల రోగులకు ఎంతో ఉపశమనము కలుగుతుంది. ఇది గడ్డలు, చర్మవ్యాధుల రోగులకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
- కందికట్టు తయారీ విధానం: కందులతో, పెసలతో, శనగలతో, ఉలవలతో కట్టు తయారుచేస్తారు. ఈ కట్టు ఆరోగ్యానికి మంచిది. బలాన్ని వీర్యపుష్టిని ఇచ్చేది కంది కట్టే. మనం జబ్బుపడపుడే దీనిని వాడతాము కదా! అప్పుడప్పుడు వాడటం చాలా మంచిది. కందిపప్పుకు 8 రెట్లు నీళ్ళుపోసి దానిని నాలుగవవంతు మిగిలేలా ఉడికించి తీసిన రససారాన్ని కట్టు అంటారు. ఇందులో పులుపుకోసం మరియు రుచికోసం దానిమ్మ గింజలు లేదా టొమాటోలు మరియు కొద్దిగా ఉప్పు కలిపి తిరగమోత పెట్టి కట్టును తయారుచేస్తారు. చక్కని బలాన్ని, వీర్యపుష్టిని ఇచ్చేది కందికట్టు.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 384, 385, 386)
- రచయిత: డా|| టి. భిక్షపతి
