అల్లము (Ginger)
From LTRC
| శాస్త్రీయ వర్గీకరణ (Scientific Classification) | |
| రాజ్యము (Kingdom): | Plantae |
| విభాగము (Division): | Tracheophyta |
| తరగతి (Class): | Liliopsida |
| క్రమము (Order): | Zingiberales |
| కుటుంబము (Family): | Zingiberaceae |
| ప్రజాతి (Genus): | Zingiber |
| శాస్త్రీయ నామం: | Zingiber officinale |
అల్లము (Ginger) అనేది అల్లం (Zingiberaceae) కుటుంబానికి చెందిన ఒక ముఖ్యమైన దుంప మొక్క. దీని శాస్త్రీయ నామం జింజిబర్ ఆఫిసినాల్ రోస్కో (Zingiber officinale). ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా సాగుచేసే ఈ మొక్క నాలుకను తడిగా ఉంచుతుంది. అల్లం అపారమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నందున దీనిని "విశ్వభేషజం" అని కూడా పిలుస్తారు.
వివిధ భాషల్లో పేర్లు
- తెలుగు: అల్లము
- సంస్కృతం: ఆర్ద్రక
- హిందీ: ఆద్రక్
- లాటిన్: జింజిబర్ ఆఫిసినాల్ రోస్కో (Zingiber officinale)
- కుటుంబము: Zingiberaceae
పోషక విలువలు
అల్లంలో అయోడిన్, ఫ్లోరిన్‌లతో పాటు గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లు కూడా ఉంటాయి.
ప్రతి 100 గ్రాముల అల్లంలో ఉండే పోషకాలు:
- తేమ: 8.9 మి.గ్రా
- ప్రోటీను: 2.3 మి.గ్రా
- క్రొవ్వు: 0.9 మి.గ్రా
- ఫైబర్ (నార): 2.4 మి.గ్రా
- కార్బోహైడ్రేట్లు: 12.3 మి.గ్రా
- మినరల్స్: 1.2 %
- క్యాల్షియం: 60 మి.గ్రా
- ఇనుము: 2.6 మి.గ్రా
- రైబోఫ్లేవిన్: 0.03 మి.గ్రా
- థైమిన్: 0.06 మి.గ్రా
- కెరోటిన్: 40 మైక్రోగ్రాములు
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- గుణాలు: అల్లం కటురసము, గురురూక్ష తీక్ష్ణ గుణములు, మధుర విపాకము మరియు ఉష్ణవీర్య గుణాలను కలిగి ఉంటుంది. ఇది వాతకఫ హరము, దీపనము, భేదనము అనే చర్యలను కలిగి ఉంటుంది. దీనికి యాంటి హిస్టమిన్, యాంటి డిప్రసెంట్ మరియు ప్రోటియోలైటిక్ గుణాలు ఉన్నాయి.
- అజీర్తి & కడుపుబ్బరం: అల్లమును ఆహారంలో ఉపయోగించడం వలన కడుపుబ్బరం తగ్గుతుంది. జీలకర్ర, సైంధవ లవణాలను అల్లం ముక్కలతో కలిపి 2-3 గ్రాములు ఉదయం-సాయంత్రం తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది.
- శీతపిత్తం (దద్దుర్లు): అల్లము రసం, పాలు, బెల్లం కలిపి సేవిస్తే దద్దుర్లు తగ్గిపోతాయి.
- ఉదర రోగాలు: అల్లము రసము మరియు పాలను సమాన భాగాలుగా కలిపి సేవిస్తే ఉదర రోగాలు తగ్గుతాయి. లేదా తైలమునకు పదిరెట్లు అల్లపురసము కలిపి తైలపాక విధిని తయారుచేసుకొని వాడవచ్చు.
- శ్వాస (Asthma), కాస (Cough): అల్లపురసం మరియు తేనె కలిపి సేవిస్తే ఉబ్బసం, దగ్గు మరియు జలుబు తగ్గుతాయి. ఇది కఫమును హరిస్తుంది.
- మధుమేహం (Diabetes): అల్లము రసము మధుమేహ వ్యాధి లక్షణాలను తగ్గించి, Hypoglycemic (రక్తంలో చక్కర శాతాన్ని తగ్గించే) గుణాలను కలిగి ఉన్నట్లు పరిశోధనల్లో గమనించారు.
- చెవి నొప్పి: అల్లము రసమును వేడిచేసి చెవిలో వేసిన చెవి పోటు తగ్గుతుంది.
- కామెర్లు (Jaundice): అల్లము ముక్కలను బెల్లంతో కలిపి 7 రోజులు ఉదయమే సేవిస్తే కామెర్లు తగ్గును. దీనికి ముందు త్రిఫలా చూర్ణమును తేనె కలిపి ప్రతి సాయంత్రం సేవించడం ఉపయుక్తంగా ఉంటుంది. (ఈ సమయంలో ఆహారంలో క్రొవ్వు పదార్థాలు, కారం, మసాలా దినుసులు వాడరాదు).
- అధిక రక్తపోటు (High BP): కాచి చల్లార్చిన నీటియందు అల్లము రసము, తేనె కలిపి ప్రతిరోజు ఉదయమున సేవిస్తే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
- శొంఠి తయారీ: అల్లము పైన ఉండే పొట్టు తీసివేసి నీటితో కడిగి 8-12 రోజులు ఎండలో పెట్టి, తెలుపు రంగు కోసం ఒకరోజు సున్నము నీటిలో ఉంచి తిరిగి ఎండబెడితే శొంఠి అవుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 347, 348)
- రచయిత: డా|| టి. భిక్షపతి
- ఆధార గ్రంథం: నిఘంటువుల నుండి ద్రవ్యగుణ ప్రయోగ విజ్ఞానము (డా|| నిష్పేశ్వర్. కె)
